సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొండి: రాజేశ్వర్ రావు

బాలికలకు ఎస్.ఎస్.వై. స్కీం పాస్ బుక్ లు పంపిణీ చేసిన వడ్డేపల్లి
అమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు. కూకట్ పల్లి నియోజవర్గంలోని పలువురు బాలికలకు పోస్టాఫీస్ ద్వారా ఈ పథకంలో పాలసీ చేయించారు. ఈ సందర్భంగా గురువారం సుకన్య సమృద్ధి యోజన పాలసీ పాస్ బుక్ లను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం రాజేశ్వర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళ సాధికారత కోసం అనేక ఉపయోగకరమైన పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. భవిష్యత్తులో అమ్మాయలకు ఆర్థిక భద్రత కల్పించాలనే గొప్ప సంకల్పంతో రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రతి అమ్మాయి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం రూ.250తో సుకన్య అకౌంట్ తెరవొచ్చని వివరించారు. నెలకు రూ. 5 వేలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలకు పైగా వస్తాయని తెలిపారు. పదేళ్ల లోపు ఉన్న ప్రతి అమ్మాయి పేరును ఈ పథకంలో చేర్చాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top