కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉగాది పర్వదినం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారి నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు ప్రారంభించారు. అనంతరం వడ్డేపల్లి తన కొత్త కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా పూజారి పంచాగ శ్రవణం వినిపించారు. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ నియోజవర్గలోని ప్రజా సమస్యలు వింటూ వాటిపై పోరాటానికే ప్రజల కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలతోపాటు పార్టీలకు అతీతంగా సామాన్యులు ఎవరైన తన కార్యాలయాన్ని సందర్శించవచ్చని సూచించారు. నియోజకవర్గంలో ఎదుర్కుంటున్న ఏ సమస్య అయిన ఏ సందర్భంలోనైనా తన దష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. తన ఆఫీస్ తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు మాట్లాడుతూ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు.. ప్రజలకు, బీజేపీ కార్యకర్తల కోసం ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. రాజేశ్వర్ రావు ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే మనిషి అని ప్రశంసించారు. ఆయన సేవలు మరింత ముందుకెళ్లాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి బీజేపీ నాయకులు, హరీశ్ రెడ్డి, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.