కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ అంబేద్కర్ నగర్ కమిటీ హాల్ లో శుక్రవారం మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని టిటిడి అడ్వైజర్ కమిటీ మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ నాయకులు వడ్డేపల్లి కూడా స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఇలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి ఆధారంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యమే అసలైన సంపద అని, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా దృఢంగా ఉండగలుగుతారని తెలిపారు. ఇటీవల కాలంలో వయసుకు అతీతంగా ఎక్కువగా గుండె పోట్లకు గురై ఆకస్మికంగా మరణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు వడ్డేపల్లి రాజేశ్వర రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. వీలైనంత వరకు దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి పోషక ఆహారం తీసుకోవాలని తెలిపారు. ప్రతి రోజు కనీసం గంట పాటు సరైన వ్యాయామం, సమయానికి భోజనం చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో మూసాపేట్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్, బీజేపీ నియోజకవర్గ నాయకులు శేఖర్ గుప్తా, మల్లేష్ గౌడ్, నాగరాజు ఇతర కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.