పేదలకు ఇండ్లు నిర్మించే వరకు బీజేపీ పోరాటం ఆపదు”
- మూసాపేటలో మాధవరం కాంతారావు చేపట్టిన ఆత్మగౌరవ దీక్షలో వడ్డేపల్లి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో వేదిక పంచుకున్న రాజేశ్వర్ రావు
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం మూసాపేటలో బీజేపీ కూకట్ పల్లి అసెంబ్లీ ఇంఛార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, మేడ్చెల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీశ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, కూకట్ పల్లి బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, ఇతర రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల కోసం మంజూరు చేస్తున్న ఇండ్లను పేదలకు అందించాలని, డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు కేటాయించాలని ‘‘ఆత్మగౌరవ దీక్ష’’ చేస్తున్న కూకట్ పల్లి బీజేపీ నేతలను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం కోరితే పెద్ద ఎత్తున ఇండ్లను మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.
దీక్ష అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మీడియాతో మాట్లాడుతూ పేదల ప్రజల కోసం కేంద్రం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన చాలా మంది పేదలు కూకట్ పల్లికి వచ్చి అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేక ఆపసోపాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పేదల బాధలను తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేసిందని వెల్లడించారు. కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని ఊరించి మోసం చేశాడని విమర్శించారు. పేదలకు పటిష్టమైన డబుల్ బెడ్రూంలు నిర్మించి, మంజూరు చేసేవరకు బీజేపీ పోరాటం ఆపదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో కూకట్ పల్లికి చెందిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు ప్రకటించారు.